చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్ ఇక రోజుకు ఒకసారే..
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో లీగల్ టీమ్ ములాఖత్‌ను అధికారులు కుదించారు.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 4:23 PM ISTచంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్ ఇక రోజుకు ఒకసారే..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయ్యిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అయితే..చంద్రబాబుతో న్యాయవాదుల బృందం ములాఖత్‌ను జైలు అధికారులు కుదించారు. లీగల్ ములాఖత్‌లో ఇప్పటి వరకు రెండు ఉండేవి.. తాజాగా వాటిని రోజుకు ఒక్కటి చేశారు. అధికారులు తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబుతో న్యాయవాదులు రోజుకు ఒక్కసారి మాత్రమే ములాఖత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రోజుకు రెండుసార్లు కలిసేవారు. ఇప్పుడు లాయర్లు రోజుకు ఒకేసారి కలవాల్సి ఉంటుంది.
చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులోనే కాదు.. ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లోనూ ఉన్నారు. ఈ కేసుల నిమిత్తం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసేందుకు చంద్రబాబుని న్యాయవాదులు తరచూ కలవాల్సి ఉంటుంది. కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కోరోజు రెండు కంటే ఎక్కువసార్లు కూడా ములాఖత్ అయ్యేందుకు అవసరం ఉండేది. కానీ.. భద్రతా కారణాలతో రోజుకు ఒక్కసారి మాత్రమే కలిసేందుకు జైలు అధికారులు అవకాశం ఇస్తున్నారు. దాంతో.. న్యాయవాదులకు కొంత మేర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
కాగా.. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రాజమండ్రి జైలు అధికారులు వెల్లడించారు. పరిపాలనా కారణాలతో రెండో ములాఖత్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పటి నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరఫున న్యాయవాదులు వివిధ పిటిషన్లు వేస్తూ.. అన్నిరకాలుగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. మరో వైపు జైలు అధికారుల నిర్ణయంపై టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుని మరికొన్ని రోజులు జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే రెండో ములాఖత్‌ను క్యాన్సిల్ చేశారంటూ మండిపడుతున్నారు. చివరకు జైలు అధికారులు కూడా ప్రభుత్వం చెప్పినట్లుగానే నడుచుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.