చంద్రబాబు లీగల్ ములాఖత్‌ పెంపు పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 7:56 AM GMT
chandrababu, legal mulakat, petition dismissed, acb court,

 చంద్రబాబు లీగల్ ములాఖత్‌ పెంపు పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి నెలరోజులు దాటింది. ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. స్కిల్‌ కేసులోనే కాదు చంద్రబాబు మరికొన్ని కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీగల్‌ టీమ్‌ ఆయన్ని జైల్లో ములాఖత్‌ అవుతున్నారు. ఇతర ఖైదీలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇటీవల లీగల్‌ టీమ్‌ ములాఖత్‌ను రోజుకు ఒక్కసారికే తగ్గించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా చంద్రబాబు లీగల్ టీమ్‌ ములాఖత్‌ను పెంచాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు ములాఖత్ పెంచాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున లాయర్లు పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణకు రాగా.. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. ప్రతివాదులను చేర్చాలని న్యాయమూర్తి సూచించగా.. ప్రతివాదుల పేర్లు చేరుస్తామని కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతం ప్రతీ రోజు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖత్ జరుగుతోంది.

కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజుకు రెండుసార్లు లీగల్‌ టీమ్‌ చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ.. ఇప్పుడు దాన్ని కేవలం ఒక్కసారికే కుదించారు. దాంతో.. తమకు కేసులో పలు విషయాలపై చంద్రబాబుతో మాట్లాడేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని లాయర్లు చెబుతున్నారు. మరోవైపు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర పూరితంగా చేయిస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రోజులు చంద్రబాబుని జైల్లో ఉంచడం కోసమే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. లీగల్‌ ములాఖత్‌లను కుదించడం వెనుక కుడా వైసీపీ ప్రభుత్వం ఉందంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story