చంద్రబాబుకి భద్రతపై అనుమానం ఉంది: భువనేశ్వరి
ఏమీ లేని కేసులో చంద్రబాబుని జైల్‌లో పెట్టారనీ.. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తుందని భువనేశ్వరి చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 5:45 PM ISTచంద్రబాబుకి భద్రతపై అనుమానం ఉంది: భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబుని భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి కలిశారు. ఆ తర్వాత భువనేశ్వరి జైలు దగ్గరే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుని జైల్లో పెట్టడం, భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే మాట్లాడేవారని అన్నారు భువనేశ్వరి. రాష్ట్ర ప్రజలంతా మీ స్వేచ్ఛ కోసం.. హక్కుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు త్వరగా వచ్చి.. ప్రజా సేవలో పాల్గొంటానని చెప్పారన్నారు. ప్రజలే ముఖ్యమని ఎప్పుడూ అనేవారని తెలిపారు భువనేశ్వరి. అయితే.. తాను బాగున్నానని.. ఎవరూ భయపడొద్దని చెప్పారన్నారు. జైల్‌లో తన భర్తకు భద్రత కల్పించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి. ఇది తమ కుటుంబానికి కష్ట సమయం అని.. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలని కోరారు. చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ని కట్టిపడేశారని అన్నారు. ఏమీ లేని కేసులో చంద్రబాబుని జైల్‌లో పెట్టారనీ.. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తుందని చెప్పారు.
చంద్రబాబుని జైల్లో వదిలేసి బయటకు వస్తుంటే తనలో ఒక భాగం అక్కడే వదిలేసి వచ్చినట్లు అనిపించందని భువనేశ్వరి భావోద్వేగమయ్యారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుందనీ.. ధైర్యంగా ఉన్నారని భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. అయితే.. చంద్రబాబు కోసం జైల్‌లో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు కానీ.. అక్కడ అలాంటివేమీ కనిపించలేదన్నారు.