చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

చంద్రబాబు హౌస్‌ కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.

By Srikanth Gundamalla  Published on  12 Sept 2023 5:11 PM IST
Chandrababu, House Remand petition, ACB Court,

చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హౌస్‌ కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్‌పై సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని.. అంతేకాక ఆయనకు జైల్‌లో భద్రత ఉండని పిటిషనర్ తరఫు లాయర్‌ వాదించారు. దానిపై అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆరోగ్యం బాగుందని.. జైల్లో పూర్తిస్థాయి భద్రత కల్పించామని కోర్టుకు తెలిపారు. జైల్‌లోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఏజీ. 24 గంటలు పోలీసులు విధుల్లోనే ఉంటారని.. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. జైల్‌కు 50 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయని అన్నారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉందని.. చంద్రబాబుని హౌస్ రిమాండ్‌కు అనుమతించ వద్దని న్యాయస్థానాన్ని కోరారు అదనపు ఏజీ.

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకి జైల్లో ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులూ అందులోనే ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబుకి ముప్పు ఉంటుందని ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారని కోర్టుకు లూథ్రా చెప్పారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉండదని కోర్టుకు విన్నవించారు లూథ్రా. గతంలో సుప్రీంకోర్టు హౌస్‌ రిమాండ్‌కు సంబంధించిన తీర్పులను కూడా వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకి హౌస్‌ కస్టడీ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించారు. అయితే.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇప్పుడు బెయిల్‌ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story