చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పు వాయిదా
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 8:07 PM ISTచంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పు వాయిదా
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు తరఫున లాయర్లు వేసిన పిటిషన్‌పై మూడు విడతలుగా న్యాయస్థానం వాదనలు విన్నది. ఇరువైపు లాయర్లు తమతమ వాదనలు బలంగా వినిపించారు. ఇరు పక్షాల తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు తన తీర్పును మంగళవారం వెల్లడించనున్నట్లు తెలిపింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్‌కు ముందు, లంచ్ బ్రేక్ తర్వాత సాయంత్రం 4.30 కు, తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత మూడు దఫాలుగా వాదనలు జరిగాయి.
చంద్రబాబుకి ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. హౌస్ రిమాండ్‌లో ఉంటే స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో చంద్రబాబు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపారు. జైల్లో కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీని కల్పించామని సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అత్యవసరం అయితే వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక భోజనం అయితే అభ్యర్థన మేరకు ఇంటి నుంచి పంపిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు చంద్రబాబుకు జైల్లో ప్రమాదం ఉందని, ఆయనకు ఇప్పటి వరకు ఎన్ఎస్జీ భద్రత ఉందని, కానీ ఇప్పుడు జైల్లో కల్పించిన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు రాజమండ్రి జైల్‌లో భద్రతకు సంబంధించి మరింత వివరణ కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రాను ఏసీబీ కోర్టు జడ్జి కోరారు. ఆ తర్వాత వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం రేపు తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇరువర్గాల న్యాయవాదులను రేపు కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు.