నన్ను అరెస్ట్‌ చేసినా చేయొచ్చు: చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  6 Sept 2023 5:00 PM IST
Chandrababu,  CM Jagan, Arrest Comments,

నన్ను అరెస్ట్‌ చేసినా చేయొచ్చు: చంద్రబాబు 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఐటీ నోటీసులు.. ఇటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రేపో.. ఎల్లుండో తనని కూడా అరెస్ట్‌ చేయొచ్చు అని చంద్రబాబు అన్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పలువురు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని.. తాము అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోంది చంద్రబాబు ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైసీపీ సర్కార్‌పై రాష్ట్ర ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని.. ఒక్క అవకాశం అనవసరంగా ఇచ్చామని అనుకుంటున్నారని చెప్పారు. జగన్ సైకో సీఎం మాత్రమే కాదు.. కరుడుగట్టిన సైకో అని ఫైర్ అయ్యారు చంద్రబాబు.

రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని జగన్ అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమాలపై ఎన్‌జీటీలో కేసులు వేసిన నాగేంద్రను వేధించారని తెలిపారు. తనపైనా దాడులు చేస్తారని.. రేపో.. ఎల్లుండో అరెస్ట్‌ చేసినా చేయొచ్చని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను ఏ తప్పూ చేయలేదని.. నిప్పులా బతికానని అన్నారు. గతంలోనూ వైఎస్‌ఆర్‌ తనపై ఎన్నో ఎంక్వైరీలు వేశారని.. అప్పుడూ ఏం చేయలేకపోయారని చంద్రబాబు అన్నారు.

Next Story