ఆగస్టు 28న ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 6:26 AM GMTఆగస్టు 28న ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపనున్నారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఓట్ల తొలగింపులో 'ఊరూరా ఉరవకొండ' లాంటి ఘటనలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండేవారి ఓట్లను చేర్చడంతో పాటు.. టీడీపీకి అనుకూల ఓట్లను తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు సీఈసీకి కంప్లైంట్ చేయనున్నారు.
ఏపీలో ఎన్నికలు ఇంకాస్త సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం అన్ని పార్టీలు పావులుకదుపుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లి అప్పడే విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ర్యాలీలు, సభలు , యాత్రలు నిర్వహిస్తున్నారు. అధికారపార్టీ వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాలంటీర్ల ద్వారా టీడీపీ, వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్ల లిస్ట్‌ను సేకరించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు అందిస్తారని టీడీపీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అధికారులు టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని.. వీటన్నింటినీ సేకరించేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వచ్చిన సమాచారం మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సమర్పించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి అక్రమాలను నివారించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను చంద్రబాబు కోరనున్నారు.