Chandrababu Custody: సీఐడీ విచారణ.. ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Sep 2023 4:50 AM GMTChandrababu Custody: సీఐడీ విచారణ.. ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని ఏసీబీ కోర్టు సీఐడీ విచారణకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. 48 గంటల పాటు విచారణ జరిపేందుకు సీఐడీ అధికారులకు అనుమతి లభించింది. అయితే.. శనివారం ఉదయం 9.30 గంటలకే విచారణ ప్రారంభం అయ్యింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
రెండ్రోజుల పాటు సీఐడీ అధికారులు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబుని విచారిస్తారు. సీఐడీ డీఎస్పీ ధనుంజేయుడు నేతృత్వంలోని 9 మంది విచారణ బృందం రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు వెళ్లింది. ఉదయం 9:30 గంటలకు విచారణ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు చంబ్రబాబుని ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు తెలిపింది. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతో పాటు ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ ఈ విచారణ బృందంలో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే సీఐడీ బృందం విచారణ జరుపుతుంది. ఏసీబీ కోర్టు ఆదేశాలను పాటిస్తూ విచారణ కొనసానుంది.
చంద్రబాబు తరఫు న్యాయవాది సమక్షంలోనే విచారణ జరుగుతుంది. అంతేకాదు.. విచారణ సమయంలో ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ.2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. లంచ్ విరామం ప్రతి గంటకు 5 నిమిషాల పాటు విరామం ఇస్తూ.. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. కాగా.. విచారణకు ముందు చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేయించారు సీఐడీ అధికారులు. విచారణ పూర్తి అయ్యాక కూడా వైద్యులు ఆయన ఆరోగ్యం గురించి పరీక్షించనున్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియను మొత్తం సీఐడీ అధికారులు వీడియో తీస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని విచారిస్తున్న సందర్భంగా.. అక్కడ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.