చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా

ఏపీ స్కిల్‌ డెవల్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది.

By Srikanth Gundamalla  Published on  21 Sep 2023 1:00 PM GMT
Chandrababu, custody petition, CID,  ACB Court ,

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా

ఏపీ స్కిల్‌ డెవల్‌మెంట్‌ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుని వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడించనున్నట్లు న్యాయవాది ప్రకటించారు. ఇక చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ హైకోర్టులో ఉన్న కారణంగా తీర్పు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకపోతే తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.

ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై బుధవారమే వాదనలు ముగిశాయి. గురువారమే తీర్పు వెల్లడిస్తామని చెప్పారు.. కానీ ఉదయం ఒకసారి.. సాయంత్రం ఓ సారి తీర్పు వాయిదా వేశారు. చివరకు కస్టడీ పిటిషన్‌పై రేపు తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మరిన్ని విషయాలు వెలికి తీసుకొస్తామని.. చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టుకు విన్నవించింది. సిట్‌ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని.. రాజకీయ కక్షపూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది కోర్టు వాదించారు. సీఐడీ కోరుతున్న ఐదు రోజుల కస్టడీని తిరస్కరించాలని కోరారు. కస్టడీ పేరుతో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని న్యాయస్థానానికి వివరించారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. విచారణ జరిగే తప్పేం ఉందని సీఐడీ తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో ప్రస్తావించారు. రూ.371 కోట్ల ప్రజాధనం వ్యవహారమని.. కస్టడీ విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్నందున ఏసీబీ కోర్టు తీర్పును గురువారం నుంచి శుక్రవారానికి వాయిదా వేసింది.

Next Story