ఏపీలో జరుగుతోన్న ఓట్ల అక్రమాలు మరెక్కడా లేవు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 5:30 PM ISTఏపీలో జరుగుతోన్న ఓట్ల అక్రమాలు మరెక్కడా లేవు: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాదాపు ఎన్నికల సంఘం అధికారులతో గంటపాటు సమావేశం అయ్యారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల అనుకూల ఓట్లను అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ లేని వింత సమస్య వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఒక పార్టీ ఓట్లను తొలగించాలనే ఆలోచన గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఎపిక్ కార్డులను ప్రింట్ చేయిస్తున్నారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరినా వాటు పట్టించుకోలేదని చంద్రబాబు తెలిపారు. అందుకే ఈ సమస్యను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. తమ హయాంలో ఇలాంటి చెత్త పనులు చేయలేదని.. ఓట్ల అక్రమాలకు పాల్పడ్డవారిని ప్రశ్నిస్తే ఇప్పుడు అక్రమంగా కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఢిల్లీ వచ్చానని చంద్రబాబు తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాము ఇచ్చిన వివరాలు పరిశీలించి.. వాస్తవం అయితే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారని అన్నారు. ఏపీలో జరుగుతున్న విధంగా దేశంలో ఎక్కడా ఓట్ల అక్రమాలు జరగడం లేదని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందే వీటిని సరిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కోరినట్లు చంద్రబాబు తెలిపారు.