తెలంగాణ పరిస్థితే త్వరలో ఏపీ ప్రభుత్వానికి వస్తుంది: చంద్రబాబు

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  8 Dec 2023 10:01 AM GMT
chandrababu, comments,  ycp govt, jagan,

తెలంగాణ పరిస్థితే త్వరలో ఏపీ ప్రభుత్వానికి వస్తుంది: చంద్రబాబు 

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో వ్యవహించినవారిన ప్రజలు ఆదరించరని చెప్పారు. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని.. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందని చంద్రబాబు అన్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగులో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. అక్కడున్న రైతులను తమకు ఏర్పడ్డ నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే చంద్రబాబు పరోక్షంగా తెలంగాణపై వ్యాఖ్యలు చేస్తూ ఏపీ సర్కార్‌ను విమర్శించారు.

ఏపీలో నియంతలా పాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే పనుల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలా వారిపై కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. అంతేకాదు.. ప్రశ్నించేవారిని జైల్లో పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే తనని కూడా చేయని తప్పుకు జైల్లో పెట్టారని అన్నారు. తానెంతో మానసిక క్షోభను అనుభవించానని చంద్రబాబు అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

దేశంలో రైతులు ఎక్కువ అప్పులపాలు అయ్యింది ఎక్కడ అంటే అది ఏపీలోనే అన్నారు చంద్రబాబు. కరవు వల్ల సగం మంది రైతులు పంటలు వేయలేదన్నారు. పంట వేసిన వారంతా తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోకుండా.. నష్టపోయిన రైతులను 3 నెలల తర్వాత తాను ఆదుకుంటానని చంద్రబాబు అన్నారు. వరి రైతులకు ఎకరాకు రూ.50వేల పైనే నష్టం వాటిల్లిందని చెప్పారు. మరోవైపు కౌలు రైతులను చూస్తే గుండె తరక్కుపోతుందని చంద్రబాబు అన్నారు.

Next Story