విజయవాడలో డయేరియాతో గత వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోయారు. తాజాగా ఈ సంఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలియజేశారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రభుత్వ యాంత్రాంగం వెంటనే ఈ డయేరియా సమస్యపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరుసగా జనాలు చనిపోతున్నా పట్టించుకోరా అని నిలదీశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారని అధికారులు చెప్పడం ఏమాత్రం సరికాదని అన్నారు. కలుషిత నీటి వల్ల అనారోగ్యానికి గురవుతున్నామనీ.. స్వయంగా ప్రజల నుంచే ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. అయినా కూడా అధికారులు స్పందించకపోవడం దారుణం అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పారు. డయేరియాతో చనిపోయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.