సాయంత్రమైతే జగన్‌ పబ్జీ ఆడతారు..పులివెందులలోనూ గెలుస్తాం: చంద్రబాబు

కుప్పంలో గెలవడం వైసీపీతో అయ్యే పని కాదు.. పులివెందులలో మాత్రం టీడీపీ గెలుపు ఖాయమైందని చంద్రబాబు అన్నారు.

By Srikanth Gundamalla  Published on  19 Jun 2023 9:52 AM GMT
Chandrababu, CM Jagan, YCP, TDP, AP Politics

సాయంత్రమైతే జగన్‌ పబ్జీ ఆడతారు..పులివెందులలోనూ గెలుస్తాం: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డే అని చెప్పుకునే వ్యక్తి జగన్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడ్కో ఇళ్లు తానే కట్టానని చెప్పడమే దీనికి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. తల్లి లేదు.. చెల్లి లేదు.. బాబయ్‌ లేడు.. బీజేపీ కూడా లేదంటూ జగన్ ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్‌ తనని ముసలివాడని అన్నాడని.. తనకున్న అనుభవమంత లేదు జగన్‌ వయసు అని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం హోదాలో ఉన్న జగన్ సాయంత్రం అయితే చాలు పబ్జీ ఆడతారంటూ కామెంట్స్‌ చేశారు.

సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో చాలా దోచుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికే 95 శాతం లూటీ చేశారని చెప్పారు. ఇలానే వదిలేస్తే రాష్ట్రంలో పరిస్థితులు నార్త్‌ కొరియాలోగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. నేరస్తుల పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. విద్యుత్ వ్యవస్థను అవినీతి మయం చేసి ప్రజలపై భారం మోపారని అన్నారు. సీఎం జగన్ అసమర్ధత వల్లే రాష్ట్రంలో భూముల విలువ తగ్గిపోయిందని.. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగాయన్నారు. ఇంటిపన్ను.. చెత్తపన్ను ఇలా అన్నింటిపై పన్నులు వేసి ప్రజలకు భారంగా మారుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీల తగ్గింపు విధానాన్ని తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.

అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 175కి 175 సీట్లు గెలిచేలా పని చేయాలని పార్టీ నేతలు, కార్యర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. కుప్పంలో గెలవడం వైసీపీతో అయ్యే పని కాదు.. పులివెందులలో మాత్రం టీడీపీ గెలుపు ఖాయమైందని చెప్పారు. అయితే.. పార్టీ కార్యక్రమాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని చంద్రబాబు సూచించారు. పార్టీలో పని చేయలేని వారుంటే ఇప్పుడే చెప్పాలన్నారు. వారి స్థానంలో మరొకరిని నియమించుకుంటామన్నారు. ఏదో మాట్లాడి వదిలేస్తారులే అని అనుకోవద్దన్నారు. పని చేయడం లేదని తెలిస్తే ఆయన నుంచి రియాక్షన్‌ గట్టిగానే ఉంటుందని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు చెప్పారు.

Next Story