సీఎం జగన్ పాలన ఏపీకి శాపంగా మారింది: చంద్రబాబు
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్ చంపేశారని.. రివర్స్ గేర్‌లో పాలన సాగుతోందని చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 2:20 PM IST
సీఎం జగన్ పాలన ఏపీకి శాపంగా మారింది: చంద్రబాబు
ఏపీలో సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ చంపేశారని.. రివర్స్ గేర్‌లో పాలన సాగుతోందని అన్నారు. సీఎం జగన్‌కు అధికార వ్యామోహం తప్ప మరో ధ్యాస లేదని అన్నారు. రాష్ట్రంలో సంక్షోభానికి సీఎం జగనే కారణం అవుతున్నారని ఆరోపించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ పాలనలో రైతులు తీవ్రంగ నష్టపోయారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గంజాయి పంట మినహా అన్ని సంక్షోభంలోనే ఉన్నాయని చెప్పారు. సమస్యలు చెబతితే రైతులపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. జగన్ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతోనే ఏపీలో రైతులు టమాటా సాగు చేయడం మానేశారని అన్నారు. ముందు చూపుతో వ్యవహిరించి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉండేవి కావని చంద్రబాబు అన్నారు. కరోనా సమయంలో రైతు ఒక్కడే బయటకొచ్చి దేశానికి అన్నం పెట్టాడు.. అలాంటి రైతన్నను.. జగన్ అప్పులపాలు చేశాడని ఆరోపించారు.
ఏపీలో భూముల ధరలు కూడా తగ్గిపోయాయని అన్నారు. దీనికి కారణం జగనే అన్నారు చంద్రబాబు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణలో ఎకరా కొంటే.. అవే డబ్బులతో ఏపీలో పది ఎకరాలు కొనచ్చు. రైతులకు గిట్టుబాటు ధరలేదు, ఆర్బీకేలు దోపిడీ చేస్తున్నాయి. అయినా కూడా జగన్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రైతులపై జగన్‌కు ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు చంద్రబాబు.
ఏపీలో రాజధాని ఏది అంటే చూపించలేని పరిస్థితులకు జగన్ కారణమన్నారు. నీటి సస్సె వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120కి పెంచేశారు. కృష్ణా, గోదావరి నదులు ఉన్న రాష్ట్రంలో నీటిపై విపరీతమైన సెస్సులు విధించారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని అనుకుంటున్నారు అని జగన్ పాలనను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ సారి ఏపీ ప్రజలంతా ఏకమై జగన్‌కు తగిన బుద్ధి చెప్పాలని.. సంక్షేమం కావాలంటే టీడీపీని గెలిపించుకోవాలని చంద్రబాబు అన్నారు.