చంద్రబాబుకి షాక్.. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి

రెండు రోజుల పాటు చంద్రబాబుని సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2023 3:23 PM IST
Chandrababu, CID Custody, ACB Court, Skill development Case,

చంద్రబాబుకి షాక్.. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరిచింది. రెండు రోజుల పాటు చంద్రబాబుని సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం స్కాం కేసులో చంద్రబాబుని ప్రధాన నిందితుడి సీఐడీ అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ కేసు అక్రమంగా బనాయించారని.. చంద్రబాబు పేరు అసలు లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు కూడా తన తరఫున స్వయంగా మాట్లాడారు. రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసులో అరెస్ట్‌ చేశారని చెప్పారు. అయితే.. సీఐడీ అధికారులు మాత్రం తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెండ్రోజుల పాటు చంద్రబాబుని విచారించేందుకు ఏసీబీ కోర్టు సీఐడీ కస్టడీకి అనుమతిచ్చింది. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లోనే చంద్రబాబుని విచారించాలని ఏసీబీ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే.. విచారణ అధికారుల పేర్లను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. చంద్రబాబుని న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని సూచనలు చేసింది ఏసీబీ కోర్టు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరిపేందుకు కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపర్చాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Next Story