రామతీర్ధం దాడి కేసు.. ఏ1గా చంద్రబాబు
Chandrababu As A1 On Vijayasaireddy car Attack Case.రామతీర్ధంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో
By తోట వంశీ కుమార్
రామతీర్ధంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఈ రిపోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు ఉంది. ఏ1 గా చంద్రబాబు నాయుడు, ఏ2 గా అచ్చెన్నాయుడు తో పాటు 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో వైపు జిల్లాలో శాంతి భద్రతలసమస్య తలెత్త కుండా సర్వమత పెద్దలతో కలిపి ప్రత్యేక కమిటిలను ఏర్పాటు చేసారు జిల్లా అధికారులు. రామతీర్దం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 ని అమలు చేస్తున్నారు. ఘటన జరిగిన బోడికోండ పైకి ఎవరినీ అనుమతించడం లేదు. జిల్లాకు చెందిన ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటెలిజెన్స్ , సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించింది ప్రభుత్వం.
ఏం జరిగిందంటే..
విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండ రామస్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు పగలకొట్టి.. శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. ఉదయం వచ్చిన పూజారీ విగ్రహా ధ్వంసాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా.. ఈ ఘటనపై పెద్ద దుమారమే చెలరేగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు రామతీర్థం వెళ్లారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి కారుపై దాడి జరిగింది.
పార్టీ జెండాలతో రామతీర్ధం కొండపైకి వెళ్లిన విజయసాయిరెడ్డిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ దిగి బయటకు వస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారు వద్దకు నడుస్తుండగా కొంత మంది ఆందోళనకారులు చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. రాయి తగిలి వాహనం ముందువైపు అద్దం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనపై విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.