హైకోర్టులో చంద్రబాబుకి ఎదురుదెబ్బ, బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి నిరాశ ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 5:39 AM GMTహైకోర్టులో చంద్రబాబుకి ఎదురుదెబ్బ, బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దరఖాస్తు చేసుకున్న మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం మూడు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. అంగళ్లు కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకి కూడా ఈ కేసులో కచ్చితంగా బెయిల్ వస్తుందని భావించారు టీడీపీ నాయకులంతా. కానీ.. అందకు భిన్నంగా హైకోర్టు తీర్పు రావడంతో అందరిలో నిరాశ నిండుకుంది. అయితే.. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే.. చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో పాత్ర వహించారని.. ఆయన ఆదేశాల మేరకు నిధలు విడుదల చేశారని.. అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. అరెస్ట్ చేసింది. గత నెల 9వ తేదీన ఉదయం 6.15 గంటలకు చంద్రబాబుని అరెస్ట్ చేసింది. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబుని రాజమండ్రి జైల్‌కు తరలించారు సీఐడీ అధికారులు. పలుమారు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయ్యి నెల దాటుతోంది.. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.