వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోంది: చంద్రబాబు

Chandra babu alleges growing discontent among YSRCP MLAs. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి పెరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం

By అంజి  Published on  5 Jan 2023 11:31 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోంది: చంద్రబాబు

కుప్పం (చిత్తూరు): యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి పెరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం కుప్పంలో టీడీపీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పార్టీ సమీక్షా సమావేశానికి నేతృత్వం వహించిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు.

మరోవైపు టీడీపీ బహిరంగ సభలకు విశేష స్పందన లభిస్తోంది. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుత్సాహానికి గురవుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నైరాశ్యం కారణంగానే సీఎం జగన్ పోలీసుల సహాయంతో టీడీపీకి ఇబ్బందులు సృష్టిస్తున్నారని అన్నారు. ''మా పార్టీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడం వైఎస్సార్‌సీపీకి అలవాటుగా మారింది. మనం ఐక్యంగా నిలబడి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి'' అని చంద్రబాబు అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని.. చంద్రబాబు స్పష్టం చేశారు.

కుప్పంలో పర్యటనలో ఉన్న చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డిపై ఫైర్‌ అయ్యారు. ''కుప్పంలో రౌడీలను ప్రోత్సహిస్తామంటే ఖబడ్దార్‌. తమాషా ఆటలాడుతున్నావు. నీ తడాఖా ఏంటో చూస్తా. నేను రెచ్చగొట్టానా? మాపై తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నావు. అధికారంలో ఉన్న 14 ఏళ్లు.. నేనూ అలాగే అనుకునుంటే నువ్వు జిల్లాలో తిరిగేవాడివా? ఇప్పుడు ఇష్టానుసారం అరాచకాలు చేస్తారా? కుప్పంలో కప్పం కట్టాలని బెదిరిస్తావా? నువ్వొక రాజకీయ నాయకుడివా? తమాషా అనుకోవద్దు.. వదిలిపెట్టం. ఇది బిగినింగ్‌ మాత్రమే'' అని చంద్రబాబు అన్నారు.

Next Story