కళ్ల ముందే క్షిపణుల వర్షం.. మృత్యునీడలో గల్ఫ్‌లో ఉన్న తెలుగు వారు
"మాకు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఒక మిస్సైల్ పడింది. అక్కడున్న ఆయిల్ ప్లాంట్ పేలిపోయి సర్వనాశనమైంది. దట్టమైన పొగ కమ్ముకుంది.
By - అంజి |
కళ్ల ముందే క్షిపణుల వర్షం.. మృత్యునీడలో గల్ఫ్‌లో ఉన్న తెలుగు వారు
హైదరాబాద్/అబుదాబి: "మాకు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఒక మిస్సైల్ పడింది. అక్కడున్న ఆయిల్ ప్లాంట్ పేలిపోయి సర్వనాశనమైంది. దట్టమైన పొగ కమ్ముకుంది. క్షిపణులు భూమిని తాకినప్పుడు మా పాదాల కింద భూమి కంపిస్తోంది. నిరంతరం 'బూమ్ బూమ్' అనే భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 237 క్షిపణులు ప్రయోగించారని తెలిసింది. మా క్యాంప్ పక్కనే ఉన్న డిఫెన్స్ సిస్టమ్ నుండి యాంటీ మిస్సైళ్లు నిప్పులు చిమ్ముతూ వెళ్తుంటే ఆకాశమంతా పొగ మేఘాలు కమ్ముకుంటున్నాయి" - ఇది అబుదాబిలోని ఒక క్రూడాయిల్ ఫ్యాక్టరీలో మెకానికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమేష్ రావురి ఆవేదన.
18 ఏళ్ల ప్రవాసం.. ఒక్కసారిగా నరకం
రమేష్ గత 18 ఏళ్లుగా దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఇటీవల కుటుంబంతో గడిపి, కేవలం 15 రోజుల క్రితమే తనతో పాటు మరో ఆరుగురు స్నేహితులను మంచి భవిష్యత్తు కోసం గల్ఫ్‌కు తీసుకెళ్లారు. కానీ, వారు ఊహించని విధంగా యుద్ధం మొదలై వారి జీవితం ఒక పీడకలగా మారింది. అబుదాబి నుంచి ఆయన తన పరిస్థితిని వివరిస్తూ గల్ఫ్ కార్మికుల వ్యథను పంచుకున్నారు.
ఇక్కడ భయం.. అక్కడ ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రమేష్ భార్య స్వాతి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. "ఎక్కడ చూసినా బాంబు దాడులే.. విమానాలన్నీ ఆగిపోయాయి. నా భర్త వెళ్లి 15 రోజులే అవుతోంది, ఇప్పుడు ఆయన ప్రాణాలకు తెగించి బయట తిరుగుతున్నారు. ఏ ప్రదేశం సురక్షితమో తెలియడం లేదు. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు" అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
బయటే ప్రాణరక్షణ..
భవనాలు కూలిపోతే లోపల చిక్కుకుపోతామనే భయంతో రమేష్‌తో పాటు దాదాపు 3,000 మంది కార్మికులు గదులను వదిలేసి బయట ఖాళీ ప్రదేశాల్లోనే ఉంటున్నారు. "లోపల ఉంటే క్షిపణి ఎప్పుడు వస్తుందో తెలియదు, తప్పించుకోలేం. అందుకే రాత్రిళ్లు కూడా బయటే కూర్చుంటున్నాం. కానీ ఇలా ఎన్ని రోజులు ఉండాలో తెలియడం లేదు" అని రమేష్ చెప్పారు. క్షిపణులు కేవలం 30 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకుంటున్నాయని, తప్పించుకోవడానికి సమయం కూడా ఉండటం లేదని ఆయన వాపోయారు.
సురక్షిత నగరం నుండి యుద్ధ క్షేత్రంగా..
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా పేరుగాంచిన అబుదాబి, ఇప్పుడు యుద్ధ లక్ష్యంగా మారింది. ఇక్కడ ఉన్న అమెరికా సైనిక స్థావరాల కారణంగానే దాడులు జరుగుతున్నాయని కార్మికులు భావిస్తున్నారు. ఎయిర్ బేస్‌లు, గ్యాస్ ప్లాంట్లు, ఆయిల్ ఫెసిలిటీలు, చివరకు అమెజాన్ గోడౌన్‌లు కూడా దాడులకు గురవుతున్నాయి.
భారత ప్రభుత్వం సూచన
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పర్యటన ప్రణాళికలు మార్చుకున్న వారు లేదా వీసా గడువు ముగిసిన వారు సమీపంలోని FRRO (Foreigners Regional Registration Office) కార్యాలయాన్ని సంప్రదించాలని కేంద్రం సూచించింది. మరిన్ని వివరాలకు https://boi.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.