టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు.. ఏ-1గా లోకేశ్
Case filed against Lokesh and TDP Leaders in Mangalagiri Police Station.మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు
By తోట వంశీ కుమార్ Published on 20 Oct 2021 2:28 PM ISTమంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ ఆఫీసులపై నిన్న వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో నేడు(బుధవారం) రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా మరికొందరిపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడి అనంతరం టీడీపీ కార్యాయానికి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారనే అభియోగంపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. ఏ-1గా నారా లోకేశ్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రవణ్, ఏ-5గా పోతినేని శ్రీనివాసరావు సహా మరికొందరిపై ఈ కేసులు నమోదు చేశారు.
బంద్ నేపథ్యంలో గృహానిర్భందం..
బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఉదయం టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలోనూ పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌తోపాటు 10 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును, పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులు, పెడనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్‌ను గృహనిర్భంధంలో ఉంచారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరవిందబాబును అరెస్ట్ చేసి శావల్యాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.