తూర్పుగోదావరి జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా.. బస్సు వెనుక చక్రాలు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో బస్సును కంట్రోల్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గోకవరం నుంచి మారేడుమిల్లి మీదుగా గుర్తేడు కు ఆర్టీసీ బస్సు ప్రయాణీకులతో వెలుతోంది. వై.రామవరం మండలం ఎడ్లకొండ వద్దకు రాగానే బస్సు వెనుక చక్రాలు రెండు ఊడిపోయాయి.
బస్సు చక్రాలు ఊడినప్పుడు పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులతో పాటు, అక్కడ ఉన్న స్థానికులు కూడా భయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసి నిలిపివేశాడు. ఈ ఘటనలో ప్రయాణీకులు అందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వేరే బస్సులో ప్రయాణీకులందరికి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా.. ఈ ఘటనపై ప్రయాణీకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు కండీషన్‌లో ఉన్నాయో చూడకుండా నడపం పట్ల మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.