డీజిల్ సెస్ పేరిట ఆర్టీసీ బాదుడు.. సామాన్యుడిపై భారం

Bus fares to rise in Andhra as APSRTC levies diesel cess.మూలిగే న‌క్క‌పై తాటి పండు ప‌డ్డ‌ట్లు అన్న చందంగా త‌యారైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2022 8:14 AM IST
డీజిల్ సెస్ పేరిట ఆర్టీసీ బాదుడు.. సామాన్యుడిపై భారం

మూలిగే న‌క్క‌పై తాటి పండు ప‌డ్డ‌ట్లు అన్న చందంగా త‌యారైంది సామాన్యుడి ప‌రిస్థితి. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఓ వైపు పెరుగుతుండ‌గా.. మ‌రో వైపు ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ అంటూ భారీగానే వ‌డ్డించింది. ప‌ల్లెవెలుగు, అల్ట్రా ప‌ల్లెవెలుగు స‌ర్వీసుల్లో గ‌రిష్టంగా రూ. 20 నుంచి రూ.25 వ‌ర‌కు పెంచ‌గా, ఎక్స్‌ప్రెస్‌ల‌లో రూ.90, అల్ట్రా డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీల్లో రూ.120, ఏసీ స‌ర్వీసుల్లో రూ.140 వ‌ర‌కు పెంచారు. పెంచిన ధ‌ర‌లు నేటి(శుక్ర‌వారం) నుంచే అమ‌ల్లోకి రానున్నాయ‌ని ఆర్టీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

పెరిగిన డీజిల్ ధ‌ర‌ల‌తో రోజుకు రూ.2.50కోట్ల మేర ఆర్టీసీపై అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని, దీంతో అనివార్యంగా డీజిల్ సెస్సును పెంచుతున్న‌ట్లు ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు తెలిపారు. కనీస దూరం ప్రయాణానికి డీజిల్‌ సెస్‌ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్‌ సెస్‌ పెంచారు.

పెంపు ఇలా..

- ప‌ల్లెవెలుగు బ‌స్సుల్లో 30 కి.మీ వ‌ర‌కు ఎలాంటి పెంపు లేదు. ఆ త‌రువాత 35 నుంచి 60 కి.మీ వ‌ర‌కు రూ.5, 65 నుంచి 70 కి.మీ వ‌ర‌కు రూ.10, 70 నుంచి 95 కి.మీ వ‌ర‌కు రూ.15, 100 నుంచి 120 కి.మీ వ‌ర‌కు రూ.20 చొప్పున పెంచారు.

- అల్ట్రా ప‌ల్లెవెలుగులో 25 కి.మీ వ‌ర‌కు ఎలాంటి పెంపు లేదు. ఆ త‌రువాత 30 నుంచి 35 కి.మీ వ‌ర‌కు రూ.5, 55 నుంచి 65 కి.మీ వ‌ర‌కు రూ.10, 65 నుంచి 100 కి.మీ వ‌ర‌కు రూ.15, 105 నుంచి 110 వ‌ర‌కు కి.మీ వ‌ర‌కు రూ.20, 115 నుంచి 120 కి.మీ వ‌ర‌కు రూ.25 చొప్పున పెంచారు.

- ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లో 30 కి.మీ వ‌ర‌కు ఎలాంటి పెంపు లేదు. ఆ త‌రువాత 20నుంచి 30 కి.మీ చొప్పున దూరం పెరిగే కొద్దీ రూ.5 చొప్పున పెంచుతూ.. చివ‌ర‌గా 491 నుంచి 500 కి.మీ దూరానికి రూ.90 పెంచారు.

- అల్ట్రా డీల‌క్స్ స‌ర్వీసుల్లో 20 కి.మీ వ‌ర‌కు ఎలాంటి పెంపు లేదు. ఆ పై 15-30 కి.మీ చొప్పున దూరం పెరిగే కొద్దీ రూ.5 చొప్పున పెంచారు. అత్య‌ధికంగా 486-500 కి.మీ దూరానికి రూ.120 పెంచారు.

- సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో 55 కి.మీ వ‌ర‌కు ఛార్జీలు య‌థాత‌థంగా ఉంటాయి. ఆ త‌రువాత దూరానికి అనుగుణంగా రూ.10 చొప్పున పెంచుతూ వెళ్లారు. గ‌రిష్టంగా 461-500 కి.మీ దూరానికి రూ.120 పెరిగింది.

- ఇంద్ర, గరుడ‌, అమ‌రావ‌తి, డాల్ఫిన్ క్రూయిజ్‌, వెన్నెల వంటి స‌ర్వీసుల్లో తొలి 35-55 కి.మీ వ‌ర‌కు ఎలాంటి పెంపు లేదు. ఆ త‌రువాత దూరానికి అనుగుణంగా పెంచారు. గ‌రిష్టంగా 500 కి.మీ వ‌ర‌కు దూరానికి రూ.140 చొప్పున పెరిగింది. ఈ ఏసీ స‌ర్వీసుల‌కు మ‌ళ్లీ 5 శాతం జీఎస్టీ అద‌నంగా వ‌సూలు చేయ‌నున్నారు.

Next Story