కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవాల్లో హింస చెలరేగింది. కర్రలతో ఇరు వర్గాల ప్రజలు కొట్టుకోవడంతో 70 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అటు బన్నీ ఉత్సవాన్ని చూసేందుకు సమీపం ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు.
ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. పలు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో తలపడతారు. ఈ సంవత్సరం కూడా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున జరిగిన కర్రల సమయంలో 70 మంది గాయపడ్డారు.
దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో విశిష్ఠత ఉంది. స్వామి వారి దేవతా మూర్తులను కాపాడుకునేందుకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళవాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.