వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. చిత్రావది నది ఉగ్రరూపం దాల్చింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కదిరిపట్టణంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. దాని శిధిలాలు పక్కనే ఉన్న మరో రెండు భవనాలపై పడ్డాయి.
ఓ భవనంలో 8 మంది, మరో భవనంలో ఉన్న 7గురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. మొత్తం 15 మందిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా ఆరుగురు సురక్షితంగా బయటపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.