అలర్ట్.. బుడమేరు వాగుకి ఏ క్షణమైనా భారీ వరద
గత కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతమంతా వణికిపోయింది.
By Srikanth Gundamalla Published on 9 Sep 2024 1:03 AM GMTగత కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతమంతా వణికిపోయింది. ఒక వైపు బుడమేరు.. మరోవైపు కృష్ణా నది ఉప్పొంగడంతో వరద పోటెత్తింది. కాలనీలకు కాలనీలు వరద నీటిలో మునిగాయి. ఇప్పుడిప్పుడే వరద నీరు తొలగిపోయి విజయవాడ కోలుకుంటోంది. ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసి.. బురదను తొలగిస్తోంది. ఈ క్రమంలోనే బుడమేరు వాగు మరోసారి ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఈ రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు.. పైనుంచి వరద వస్తుండటం వల్ల బుడమేరు వాగు మరోసారి ఉప్పొంగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటి పారుదల విభాగం అధికారులు చెప్పారు. వెలగేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటిమట్టం ఉందనీ.. అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామన్నారు అధికారులు. ఆదివారానికి ఒక అడుగు నీటిమట్టం పెరిగిందని చెప్పారు. గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయన్నారు. లోతట్టున ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, రామవరప్పాడు, అజిత్‌సింగ్ నగర్ సహా చాలా ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. అలాగే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.