కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. దీంతో దాదాపు అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో అయితే.. ఒకే బెడ్ పై ఇద్దరు చొప్పున రోగులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వైపు కరోనా ప్రాణాలు తీసుకుంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనను చూస్తే హృదయం తల్లడిల్లక మానదు.
అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కరోనా విభాగంలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులను పడుకోబెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు. గురువారం కణేకల్లు మండలానికి చెందిన ఓ వృద్దుడు కరోనా లక్షణాలతో ఊపిరాడని స్థితిలో ఆస్పత్రిలో చేరారు. బెడ్లు లేకపోవడంతో ఆ వృద్దుడిని.. ఓ యువకుడు ఉన్న బెడ్డుపైనే పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. అయితే.. కొన్ని గంటల్లోనే ఆ వృద్దుడు మరణించాడు. అయినప్పటికి దాదాపు రెండుగంటల పాటు వృద్దుడి మృతదేహాం ఉన్న పడకపైనే యువకుడికి ఆక్సిజన్‌తో చికిత్స అందించారు. కరోనా కష్టకాలంలో బెడ్‌ల కొరత ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది.
ఇక ఏపీలో నిన్న కొత్తగా 21,954 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 12,28,186కి చేరింది. ఒక్క రోజే 72 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 8,446కి పెరిగింది. నిన్న 10,141 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 10,37,411కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,82,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.