నాగార్జునసాగర్ వద్దకు పోలీసులను పంపడం ఘోరం: పురందేశ్వరి
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 1:07 PM ISTనాగార్జునసాగర్ వద్దకు పోలీసులను పంపడం ఘోరం: పురందేశ్వరి
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె స్పందించారు. సాగర్ ప్రాజెక్టు వద్దకు పోలీసులను పంపించడం ఘోరమైన విషయమని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారని పురందేశ్వరి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఏపీ, తెలంగాణ అధికారులు ఈ విషంలో ఘర్షణ పడ్డారని ఆమె గుర్తు చేశారు. మరోసారి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారా అని పురందేశ్వరి అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓట్ల కోసం ఈ వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం తీరుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
ఏపీలో ప్రస్తుతం 400 మండలాల్లో కరవు ఉందని ఆమె అన్నారు. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం 100 మండలాల్లోనే కరవు ఉందని గుర్తించడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం రైతులను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు విషయం గురించి ఏపీ కేబినెట్ ఒక్కసారి కూడా చర్చించపోవడం దారుణమని అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అనే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఏపీ ప్రజలు కూడా మన వ్యవసాయశాఖ మంత్రి ఎవరు అని వెతుక్కుంటున్నారని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎవరంటే మాత్రం చెప్పేస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడంతో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పురందేశ్వరి అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ తప్ప మరోటి కాదని ఆమె ఆరోపించారు.