కడప-బెంగళూరు రైల్వే లైన్ వద్దని జగన్ లేఖ రాశారు: పురందేశ్వరి

ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 Nov 2023 3:30 PM IST
bjp, purandeswari,  ycp govt, cm jagan,

కడప-బెంగళూరు రైల్వే లైన్ వద్దని జగన్ లేఖ రాశారు: పురందేశ్వరి

ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని విధాలుగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నా.. వాటిని వినియోగించుకోవడంలో వైసీపీ సర్కార్‌ ఫెయిల్‌ అయ్యిందన్నారు పురందేశ్వరి.

అన్నమయ్య జిల్లా రాజంపేటలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. ఈ మేరకు పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పార్టీ బలోపేతంపై ఆమె చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు పురందేశ్వరి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మాట్లాడిన పురందేశ్వరి ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేకపోయింది జగన్‌ సర్కార్‌ అని అన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏడాదికి రూ.350 కోట్ల కోట్ల చొప్పున కేంద్రం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. అయితే.. వాటిని వినియోగించుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం రహదారులు కూడా నిర్మించలేకపోయారంటూ మండిపడ్డారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో సరైన విద్యాంస్థలు కూడా అందుబాటులో లేవన్నారు. రాజంపేటలో కేంద్రీయ విద్యాలయం మంజూరు అయితే స్థలం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ పురందేశ్వరి విమర్శలు చేశారు.

రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్‌కు పెద్దగా పట్టింపు లేనట్లుగా వ్యహరిస్తున్నారంటూ పురందేశ్వరి ఫైర్ అయ్యారు. కడప-బెంగళూరు రైల్వేలైన్ కోసం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పనులు ప్రారంభిస్తే... జగన్ మాత్రం ఆ లైన్‌ వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పురందేశ్వరి. ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారే కానీ.. వాస్తవంలో చేసిందేమీ లేదంటూ ఆరోపించారు. వైసీపీ సర్కార్ పాలన ఎలా ఉందో ప్రజలే గుర్తించాలంటూ విన్నవించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లు గడుస్తున్నా.. వాటి నిర్మాణానికి నిధులు కేటాయించపోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం అన్నారు. ఏపీలో మద్యం కుంభకోణంపై సీబీఐ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు.

Next Story