మేం న‌ష్ట‌పోతాం.. డీలిమిటేషన్ ప్రయోజనం కల్పించండి : టీడీపీ

పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. కేంద్రం తీసుకున్న అడుగుపై ప్రశ్నలు సంధించింది.

By Kalasani Durgapraveen  Published on  15 Dec 2024 11:17 AM IST
మేం న‌ష్ట‌పోతాం.. డీలిమిటేషన్ ప్రయోజనం కల్పించండి : టీడీపీ

పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. కేంద్రం తీసుకున్న అడుగుపై ప్రశ్నలు సంధించింది. లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా జనాభా ప్రాతిపదికన తదుపరి డీలిమిటేషన్ చేయడంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు. తదుపరి డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని.. ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా లాభపడతాయని ఎంపీ అన్నారు.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ చేస్తే యూపీ, బీహార్‌, ఎంపీ, రాజస్థాన్ రాష్ట్రాల సీట్లు ఇప్పుడున్న 169 నుంచి 324కు పెరుగుతాయని.. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కేరళలో సీట్లు పెరుగుతాయని లెక్కలు చెబుతున్నాయని ఎంపీ చెప్పారు. కర్ణాటకలో సీట్లు ప్రస్తుతం ఉన్న 129 నుంచి 164కి పెరుగుతాయి. ఇది ఫెడరలిజానికి అనుకూలంగా లేదని టీడీపీ ఎంపీ అన్నారు. జనాభా తగ్గిన రాష్ట్రాలకు కూడా డీలిమిటేషన్ ప్రయోజనం కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదించేందుకు గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని దేవరాయలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేస్తోందని, కేంద్రం పంపిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ ఆంధ్రా విభజన జరిగిందని ఎంపీ విమర్శించారు.

2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలను పెరిగిన సీట్లతో నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. డీలిమిటేషన్ చట్టం ప్రకారం.. 2026 వరకు లోక్‌సభ స్థానాలను పెంచలేరు. దీని తర్వాత, జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయవచ్చు. అంచనాల ప్రకారం 2027 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ పూర్తవుతుంది.

Next Story