కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ మహమ్మారి నుంచి ఇంకా తేరుకోకముందే.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రంలో బర్డ్ ప్లూ కలకలం రేపుతోంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు, బాతులను చంపేశారు. వైరస్ గుర్తించిన ప్రాంతాల్లో కిలోమీటర్ రేడియస్ పరిధిలో పౌల్ట్రీలలోని కోళ్లను సంచుల్లో మూటగట్టి గోతిలో పాతి పెడుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలోనూ బర్డ్ ప్లూ కలకలం రేపుతోంది.
పామూరు మండలం అయ్యవారి పల్లెలోని దేవాలయం పైనున్న గాలిగోపురం దగ్గర ఆరు పక్షులు(పిచుకలు) చనిపోయాయి. అవి బర్డ్ ప్లూ కారణంగానే చనిపోయాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక దాని తర్వాత ఒక పక్షి గాలి గోపురం నుంచి కిందపడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మృత్యువాత పడిన పక్షులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. తమ అనుమానాలను నివృత్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిన్న ఒక కాకి చనిపోగా.. నేడు పిచుకలు చనిపోవడంతో.. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇక రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ వెలుగు చూసిన నాటి నుంచి జనవరి 27వ తేదీ వరకు మృతిచెందిన పక్షుల సంఖ్య 6వేల 937కి చేరింది.