దుర్గ‌గుడి వెండి సింహాల కేసు.. దొంగ దొరికాడు..!

Bezawada Durga temple lion idols missing case.బెజవాడ ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ ర‌థానికి ఉండే 3 వెండి సింహా ప్ర‌తిమ‌ల దొంగ దొరికాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2021 4:52 AM GMT
Bezawada Durga temple lion idols

బె‌జ‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ ర‌థానికి ఉండే 3 వెండి సింహా ప్ర‌తిమ‌ల మాయమైన ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును బెజ‌వాడ పోలీసులు చేదించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పాత నేర‌స్థుడే ఈ చోరీకి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. గత ఏడాది సెప్టెంబర్ లో వెండి సింహాలు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పోలీసులు మూడు ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దింపాయి. ఆల‌యంలో పనిచేసే సిబ్బందితో పాటు కొన్ని వందల మందిని విచారించారు. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు పురోగ‌తి సాధించిన‌ట్లు తెలుస్తోంది.

పశ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పోలీసులు దొంగ‌త‌నాల కేసులో బాల‌కృష్ణ అనే నిందితుడ్ని ఇటీవ‌ల అరెస్టు చేశారు. విచార‌ణ స‌మ‌యంలో దుర్గ‌గుడిలో వెండి సింహాల‌ను తానే చోరీ చేసిన‌ట్లు అంగీక‌రించాడు. దీంతో ఈ విష‌యాన్ని విజ‌యవాడ పోలీసుల‌కు తెలిపారు. స‌మాచారం అందుకున్న ప్ర‌త్యేక బృందం అక్క‌డ‌కు వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దుర్గగుడికి సంబంధించి ప్రతిమల చోరీ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నెలలు గడుస్తున్నా పురోగతి లేకపోవటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. గత ఏడాది ఉగాది నుంచి రథాన్ని బయటకు తీయలేదని ఆ మధ్యకాలం అంటే ఏడాది మధ్య కాలంలో చోరీ జరిగి ఉంటుందని పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయటంతో చోరీ ఎప్పుడు జరిగిందో గుర్తించటమే పోలీసులకు సవాలుగా మారింది. లాక్ డౌన్ సమయంలో చోరీ జరిగిందని పోలీసులు గుర్తించినప్పటి నుంచి విచారణ వేగవంతం చేశారు. వెండి రథానికి ఉన్న నాలుగు ప్రతిమల్లో మూడు మాత్రమే చోరీకి గురయ్యాయి.

తొలుత ఇంటి దొంగల పనిగానే పోలీసులు అనుమానించారు. ఆ దిశ‌లో విచార‌ణ చేసిన‌ప్ప‌టికి అందుకు ఆధారాలు లేకపోవటంతో.. శివాలయం నిర్మాణ పనులకు వచ్చిన కార్మికులు చేశారేమోనని వందల మంది కార్మికులను విచారించారు. ఇందుకు బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్ళారు పోలీసులు. అయితే వారికి ఇందులో ప్రమేయం లేదని స్పష్టం కావటంతో దొంగల పనే అయి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. దుర్గగుడి రథం ప్రతిమల చోరీలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఫోరెన్సిక్ విభాగం డైరెక్టర్ శారీన్ తో పాటు ఇతర నిపుణుల బృందం ప్రతిమలు చోరీకి గురైన రథాన్ని పరిశీలించి పక్కాగా ఇది దొంగల పనే అని రిపొర్టు ఇవ్వటంతో పోలీసులు ఆ దిశ‌గా విచార‌ణ చేప‌ట్టారు.

వెండి సింహాల‌ను దొంగించిన బాల‌కృష్ణ వాటిని తూర్పుగోదావ‌రి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి అమ్మేసాడు. ఆ వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌తిమ‌ల‌ను వ్యాపారి క‌రిగించాడ‌ని.. వాటి బ‌రువు 16 కిలోలు ఉంటుంద‌ని చెబుతున్నారు.


Next Story
Share it