Video: సముద్రంలోకి కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.. పోలీసుల తెగువతో..

సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీస్ సిబ్బంది కాపాడారు. ఈ ఘటన నిన్న సాయంత్రం ఏపీలోని రామాపురం బీచ్‌లో జరిగింది.

By అంజి  Published on  14 Aug 2023 9:00 AM IST
Bapatla district, AP police, Seabreeze Beach, sea

Video: సముద్రంలోకి కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.. పోలీసుల తెగువతో..

ఆపద వస్తే దేవుడు వస్తాడో రాడో.. తెలియదు కానీ పోలీస్ మాత్రం వస్తాడు.. ఓ సినిమాలో డైలాగ్ ఇది. అయితే ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు బాపట్ల జిల్లా పోలీసులు. సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీస్ సిబ్బంది కాపాడారు. వివరాల్లోకెళితే.. ఆగష్టు 13 ఆదివారం సాయంత్రం సుమారు 4:15 గంటల సమయంలో కర్నూలు జిల్లాకి చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ ఇరువురు తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి వారు సముద్రంలోకి కొంత దూరం కొట్టుకుపోయారు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించారు. కానిస్టేబుళ్లు ఎస్. గణేష్, ఎం. వెంకటేశ్వర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోనికి వెళ్లి యాత్రికుల ప్రాణాలను రక్షించి ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారితోపాటు వచ్చిన తోటి యాత్రికులకు అప్పగించినారు. తోటి యాత్రికులు పోలీస్ సిబ్బంది చూపిన తెగువ, దైర్య సాహసాలను కొనియాడినారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ యువకుల ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుల ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.

Next Story