ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం సొంత నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకోకపోతే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.ఏపీ మంత్రి కొడాలి నానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బాలకృష్ణ. తమను రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
న్యాయం, చట్టంపై లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని.. సహనాన్ని పరీక్షించవద్దన్నారు. ఉత్తుత్తి మాటలు చెప్పడానికి తాను మాటల మనిషిని కాదని, అవసరమైతే చేతలు కూడా చూపిస్తానన్నారు. పేకాటలో పట్టుబడిన వారు రూ. 10 వేలు చెల్లించి బయటకు వచ్చి మళ్లీ జూదం ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. హిందువులనే కాదు.. అన్ని మతస్తులను ఆవేదనకు గురి చేస్తున్నారన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని తెలిపారు. టీడీపీ హాయంలో.. ఇన్ పుట్ సబ్సిడీ, పంటనష్టం అందించామని.. తూతు మంత్రిగా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోందని విమర్శించారు.