స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకి రెగ్యులర్‌ బెయిల్

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు.

By Srikanth Gundamalla  Published on  20 Nov 2023 9:17 AM GMT
bail,  chandrababu, tdp,  skill development case,

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకి బెయిల్ మంజూరు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు జస్టిస్‌ టి. మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. నవంబర్‌ 28వ తేదన రాజమండ్రి జైలుకు చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే.. 30వ తేదీన మాత్రం ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

స్కిల్‌ డెవల్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 17వ తేదీనే వాదనలు ముగిశాయి. కానీ హైకోర్టు తీర్పుని రిజర్వ్‌ చేసింది. ఇవాళ వెల్లడిస్తామని ముందే చెప్పింది. తాజాగా స్కిల్‌ డెవలప్‌మెట్‌ స్కీం కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా.. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధాతర్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఏపీ సీఐడీ అధికారులు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. పోలీసులు కూడా చట్టానికి విధేయులై ఉండాలని.. కానీ వారూ సహకరించినట్లు చెప్పారు. రాజకీయ నేతలకు పోలీసులు సహకరించారని అన్నారు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే.. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని అన్నారు. ఈ క్రమంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు.

ఏపీ సీఐడీ తరఫున వాదనలు వినిపంచిన అదనపు ఏజీ సుధాకర్రెడ్డి.. వైద్య నివేదికలను సీల్డ్‌ కవర్లో అందజేయాలని కోర్టు చెప్పినా పిటిషనర్‌ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఇచ్చిన నివేదిక నమ్మశక్యంగా లేవని అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్‌ మంజూరు కోసం ఆరోగ్య నివేదికలను పరిగణనలోకి తీసుకోవద్దని అన్నారు. ప్రభుత్వ వైద్యులతో మరోసారి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అయితే.. చంద్రబాబుకి ముందు బెయిల్‌ రాగానే ఆస్పత్రికి వెళ్లకుండా ర్యాలీలు నిర్వహించారని గుర్తు చేశారు అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి.

ఇరుపక్షాల వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. సోమవారానికి తీర్పుని రిజర్వ్‌ చేసింది. తాజగా చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబు బిగ్‌ రిలీఫ్ దక్కినట్లు అయ్యింది.

Next Story