క‌రెంట్ కోత‌లు.. నర్సీపట్నం ఆస్పత్రిలో సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ప్ర‌స‌వం

Baby Delivered under mobile lights in Narsipatnam hospital after power cut.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యుత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2022 11:03 AM GMT
క‌రెంట్ కోత‌లు.. నర్సీపట్నం ఆస్పత్రిలో సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ప్ర‌స‌వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోత‌ల‌తో జ‌నం అల్లాడుతున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి క‌రెంట్ పోవ‌డంతో ఆస్ప‌త్రుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో క‌రెంట్ కోత‌ల వ‌ల్ల రోగులు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పే చిన్న ఘ‌టన ఇది. క‌రెంట్ లేక‌పోవ‌డం, జ‌న‌రేట‌ర్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో మొబైల్ ఫోన్ లైట్ల వెలుతురుతో ఓ మ‌హిళ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న న‌ర్సీప‌ట్నంలోని ఎన్టీఆర్ ప్ర‌భుత్వాసుప‌త్రిలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. కేడీపేట‌కు చెందిన ఓ మ‌హిళ‌కు బుధ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో పురిటి నొప్పులు వ‌చ్చాయి. ఆస్ప‌త్రిలో క‌రెంట్ లేక‌పోవ‌డం, జ‌న‌రేట‌ర్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురుతో వైద్యులు ఆమెకు ప్ర‌వ‌సం చేశారు.

కరెంటు లేని ఆసుపత్రి ప్రాంగణం, టార్చ్ లైట్ల వెలుతురులో పనిచేస్తున్న సిబ్బందిని ఈ వీడియో చూపిస్తోంది.

గర్భిణి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసవానికి కొవ్వొత్తులు, లైట్లు కావాలని రోగుల స‌హాయ‌కుల‌ను న‌ర్సు కోరింది. దాదాపు రెండు-మూడు గంటలైంది. కరెంటు లేదు, ఫోన్/టార్చ్ లైట్ల వెలుతురులో ప్ర‌స‌వం చేశారు. సెల్ ఫోన్ లైట్ల వెలుగులో ఏ ఆసుపత్రిలో ప్ర‌వ‌సం చేస్తారు? శిశువుకు ఏదైన జ‌ర‌గ‌రానిది జ‌రిగితే ఎంట‌ని నవజాత శిశువును పట్టుకొని ఆమె ప్రశ్నించింది.

త‌న భార్య‌కు పురిటి నొప్పులు రావడంతో కేడీపేట నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చామని మహిళ భర్త తెలిపాడు. నర్సులు ఆమెకు ట్యాబ్లెట్ ఇచ్చి చికిత్స ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో సిబ్బంది కొవ్వొత్తులు కావాలని అడిగారు. ఆ స‌మ‌యంలో కొవ్వొత్తులు ఎక్క‌డ దొరుకుతాయి.? చేసేది లేక సెల్‌ఫోన్ల లైట్ల వెలుతురులోనే ప్ర‌స‌వం చేశారన్నారు.

మరోవైపు.. గైనకాలజీ వార్డులో పరిస్థితి దారుణంగా ఉంది. గర్భిణి కొవ్వొత్తుల వెలుగులో పడుకోవాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయని ఆసుపత్రిలో రోగులు తెలిపారు. పేరొందిన దవాఖానలో కనీస వసతులు లేవని, దోమల బెడదతో గర్భిణి గాలి, వెలుతురు లేకుండా బతుకుతున్నదని, సోమవారం సాయంత్రం నుంచి కరెంటు రావడం లేదని నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి అటెండర్ వాపోయాడు.

అధికారులు ఏం చెబుతున్నారు

ఆసుపత్రి సేవల జిల్లా కోఆర్డినేటర్‌ రమేష్‌ కిషోర్‌ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి విద్యుత్‌ కోతలు ఉన్నాయని, దీంతో జ‌న‌రేట‌ర్ సాయంతో ఆస్పత్రి న‌డుస్తోంద‌న్నారు. అయితే.. ఓ నాలుగు, ఐదు గంట‌ల త‌రువాత జ‌న‌రేట‌ర్‌లో సాంకేతిక లోపం ఏర్ప‌డింద‌న్నారు. గురువారం కూడా క‌రెంట్ పోవ‌డంతో కొద్దిసేపు ఇన్వ‌ర్ట‌ర్‌తో న‌డిచింద‌న్నారు. జ‌న‌రేట‌ర్ మ‌ర‌మ్మ‌తు ప‌నుల కోసం విశాఖ‌ప‌ట్నం నుంచి టెక్నిక‌ల్ టీమ్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు.

Next Story