సజ్జలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 4:55 PM ISTసజ్జలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాగైనా తాము అధికారంలోకి రావాలని జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఆదివారం రాష్ట్రప్రభుత్వం, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారనీ.. పోలీసులు వైసీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ మేరకు డీజీపీకి టైమ్ దగ్గరపడిందంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘం అధికారుల వద్దకు వెళ్లారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పదవిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వ సంబంధిత పనుల గురించే మాట్లాడాలని చెప్పారు. కానీ ఆయన రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతూ వచ్చారని అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లఘించారంటూ సజ్జల తీరుని ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫిర్యాదుని అందించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని ఈసీకి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.