AP Assembly: రణరంగంలా అసెంబ్లీ.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు.!
ఈరోజు ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా
By అంజి Published on 20 March 2023 11:45 AM ISTరణరంగంలా అసెంబ్లీ.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు.!
ఏపీ బడ్జెట్ - 2023: ఈరోజు ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చట్టసభ.. పాలక, ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి వేదికైంది. ఇవాళ ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. జీఓ నంబర్ 1 రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ కుర్చీని చుట్టుముట్టిని టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. సభా సమయాన్ని వృథా చేయడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు.
టీడీపీకి పోటీగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ పొడియం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పోడియం వద్దకు దూసుకొచ్చి డోలా వీరాంజనేయ స్వామిని బలవంతంగా వెనక్కి లాగడంతో డోలా బాల వీరాంజనేయ స్వామి పోడియంపై పడిపోయారని చెబుతున్నారు. ఈ ఆకస్మిక పరిణామంపై ఆశ్చర్యపోయిన స్పీకర్ సభను వాయిదా వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య తోపులాట జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టీడీపీ ఎమ్మెల్యేలు దూషించినట్టు తెలిసింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత.. 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభలో ఇవాళ జరిగిన ఘటన దురదృష్టకరమైనదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు సభకు.. తన సభ్యులను రెచ్చగొడుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ సభ్యుల్లో మార్పు రావాలని అంబటి ఆకాంక్షించారు.
శాసనసభ చరిత్రలో చీకటి రోజు: అచ్చెన్నాయుడు
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేశారని అచ్చెన్నాయుడు చెప్పారు. సీనియర్ శాసనసభ్యుడు గోరంట్లపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పోడియంపైకి వైసీపీ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా వచ్చారన్నారు. ప్రత్యక్ష దాడి చేసి వైసీపీ ప్రభుత్వం.. శాసనసభ పరువు తీసిందన్నారు. శాసనసభ చరిత్రలో ఇదోక చీకటి రోజు అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారనే ఆందోళన వైసీపీలో ఉందన్నారు.