గుంటూరు జిల్లాలో విషాదం.. క‌రోనా వ్యాక్సిన్ విక‌టించి ఆశా కార్య‌క‌ర్త మృతి

Asha worker dies three days after taking Coronavirus vaccine..గుంటూరు జిల్లాలో క‌రోనా వ్యాక్సిన్ విక‌టించి ఆశా కార్య‌క‌ర్త విజ‌య‌ల‌క్ష్మీ మృతి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jan 2021 11:23 AM IST
గుంటూరు జిల్లాలో విషాదం.. క‌రోనా వ్యాక్సిన్ విక‌టించి ఆశా కార్య‌క‌ర్త మృతి

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేయ‌డానికి టీకా పంపిణీ కొన‌సాగుతోంది. అయితే.. ఈ టీకా తీసుకున్న కొంద‌రు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. క‌ళ్లు, తిర‌గ‌డం, త‌ల‌నొప్పి, మ‌గ‌త వాంతులు వంటి ల‌క్ష‌ణాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. చిన్న‌చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న‌ప్ప‌టికి పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరులో విషాదం చోటుచేసుకున్న‌ది. క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశావ‌ర్క‌ర్ ప్రాణాలు కోల్పోయింది.

వివ‌రాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20న కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. టీకా తీసుకున్న త‌రువాత లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్‌ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. వెంట‌నే వీరిద్ద‌రి చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. ఆందోళన వల్ల ఏఎన్‌ఎం లక్ష్మికి రియాక్షన్‌ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు.

అయితే.. ఆశ‌ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురైంది. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు ఆదివారం ఉద‌యం జీజీహెచ్ వైద్యులు తెలిపారు. విజ‌య‌ల‌క్ష్మీ తాడేప‌ల్లి మండ‌లం పెనుమౌక‌లో ఆశా వ‌ర్క‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది. ఇదిలావుండగా.. విజయలక్ష్మికి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడం గమనార్హం.




Next Story