సీఐతో వాగ్వాదం.. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు

వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని...

By -  అంజి
Published on : 11 Oct 2025 10:52 AM IST

Argument with CI, Police register cas, former minister Perni Nani , Chilakalapudi

సీఐతో వాగ్వాదం.. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు

అమరావతి: వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న మచిలీపట్నం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించి, బెదిరించినందుకు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) విద్యాసాగర్ నాయుడు తెలిపారు.

గతంలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఆ నిరసనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పర్మిషన్‌ లేని నిరసనకు వెళ్తున్నారంటూ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం నిందితుడు సుబ్బన్న పోలీసుల ముందు హాజరు కాకపోవడంతో మచిలీపట్నం పోలీసులు అతన్ని విచారణ కోసం తీసుకువచ్చారని కృష్ణ ఎస్పీ తెలిపారు.

"పోలీసుల ముందు హాజరు కావాలని BNSS చట్టంలోని సెక్షన్ 35(3) కింద నిందితుడు సుబ్బన్నకు పోలీసులు నోటీసులు అందించారు. అయితే, సుబ్బన్న హాజరు కాలేదు. వాట్సాప్‌లో సందేశాలు పంపడం ద్వారా పోలీసు విచారణకు సహకరించవద్దని ఇతరులను ప్రోత్సహించాడు" అని ఎస్పీ చెప్పారు. ఈ విషయంలో నిందితుడిని మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే పేర్నినాని, పలువురు వైసీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ నుంచి సుబ్బన్నను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని ఎస్పీ తెలిపారు. ఎస్పీ ఈ చర్యను ఖండిస్తూ, పోలీసులు మరియు ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.

Next Story