శుభవార్త.. సంక్రాంతికి 6,400 ప్రత్యేక బస్సులు.. 10 శాతం రాయితీ
APSRTC to operate more 6,400 buses for Sankranti.ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండుగకు వెళ్లేవారికి శుభవార్త చెప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 20 Dec 2022 8:01 AM GMTఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండుగకు వెళ్లేవారికి శుభవార్త చెప్పింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లి వచ్చే వారి కోసం 6400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. సాధారణ ఛార్జీలే ఈ ప్రత్యేక బస్సుల్లో ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.
జనవరి 6 నుంచి 14 వరకు 3120, జనవరి 15 నుంచి 18 వరకు 3,280 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఈ బస్సులు నడవనున్నాయి. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడపుతారు. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేన్ సదుపాయాన్ని కల్పించారు. రెండు వైపుల అంటే(వెళ్లేటప్పుడు, వచ్చే టప్పుడు) కలిపి ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తున్నారు. అన్ని దూర ప్రాంత సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుంది. అన్ని బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రయాణీకులకు సమాచార కోసం 24/7 కాల్‌సెంటర్‌ను (0866-2570005) నిర్వహిస్తోంది ఆర్టీసీ.
కరోనా మహమ్మారి తరువాత ఆర్టీసీకి ఆదాయం భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం టికెట్ల రూపంలో ఆర్టీసీ రూ.3,448 కోట్ల ఆదాయం సమకూరితే ఈ సారి నవంబర్ చివరి నాటికి రూ.3,866 కోట్ల ఆధాయం లభించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆదాయం భారీగా పెరుగుతందని అంచనా వేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 63 శాతం ఉంటే ఈ ఏడాది 68 శాతానికి పెరిగింది.