ఈ సంక్రాంతి సీజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)కి కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా జనవరి 18న రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం ఒక్క రోజే రూ.23 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రోజులో వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు వసూలు చేయడం వల్లే ప్రయాణీకులు సంస్థను ఇంకా ఎక్కువ ఆదరించినట్లు పేర్కొంది.
కార్గో సర్వీసుల ద్వారా ఈ నెల 18న రూ.55 లక్షల ఆదాయం వచ్చింది. కార్గోలో ఇప్పటి వరకు ఒక రోజు ఆదాయం రూ.45లక్షలు ఉండగా దాన్ని అధిగమించి రికార్డు నెలకొల్పింది. సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కృషిని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు. ఆదరించిన ప్రయాణికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. గతంలో ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. అయితే.. ఈ సారి సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేశారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 6 నుంచే ప్రత్యేక బస్సులను నడపడంతో 14 తేదీ భోగీ వరకే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 9 రోజుల్లో 141 కోట్ల ఆదాయం వచ్చింది. 6 నుంచి 14 వరకు రోజు తిరిగే బస్సులకు అదనంగా 3,392 ప్రత్యేక బస్సులను నడిపారు. ప్రత్యేక బస్సుల ద్వారానే రూ.7.90 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్పారు.