APSRTC : 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఉచిత ప్ర‌యాణం

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2023 8:20 AM IST
APSRTC, SSC Students

ప్ర‌తీకాత్మ‌క చిత్రం



ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(ఏపీఎస్‌ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. పరీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని వెల్ల‌డించింది. అన్ని ప‌ల్లె వెలుగు, సిటీ ఆర్డిన‌రీ బ‌స్సుల్లో మాత్ర‌మే ఈ సౌక‌ర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల‌కు బ‌స్ పాస్ లేకున్న‌ప్ప‌టికీ హాల్ టికెట్ చూపించి విద్యార్థులు స‌కాలంలో ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవ‌చ్చున‌ని తెలిపింది. ప‌రీక్ష ముగిసిన అనంత‌రం ఎగ్జామ్ సెంట‌ర్ నుంచి త‌మ గ‌మ్య‌స్థానాల‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని చెప్పింది.

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షల సమయంలో ఈ అవకాశం ఉండ‌నుంది. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌త్యేకంగా బ‌స్సులు సిద్ధం చేస్తోంది. దీనిపై విద్యార్థులంద‌రికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆర్టీసీ సిబ్బందికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప‌లువురు విద్యార్థులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా..ఈ సారి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు 6 లక్షల 50 వేల మంది విద్యార్థులు హాజ‌రు అయ్యే అవ‌కాశం ఉంది.

Next Story