సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఓ వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుండగా మరో వైపు ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్ ధరల పెరుగుదలతోనే ఛార్జీలను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 5 మేర పెంచినట్లు తెలిపారు. రేపట్నుంచి పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.10 ఉంటుందని తెలిపారు. సెస్ పెంపు వల్ల ప్రజలపై ఏడాదికి రూ.720 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొన్నారు.
ఆర్టీసీ పరిస్థితి దిగజారిందన్నారు. గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. సగటున రోజుకు 61లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని తెలిపారు. డీజిల్ రేటు దాదాపు 60 శాతం పెరిగిందని, రెండేళ్లుగా రూ.5,600 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ప్రస్తుతం నష్టాలు భరించలేని పరిస్థితికి ఆర్టీసీ వచ్చిందని, తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ధరలపై ఎలాంటి మార్పు చేయకుండానే డీజిల్ సెస్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వను్ననట్లు తెలిపారు. కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటామన్నారు.