విజయవాడ నుంచి పార్వతీపురం వెలుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) బస్సు కాకినాడ జిల్లా తునికి సమీపంలో జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో అతి వేగంతో బస్సు నడపడంతో డివైడర్ ఢీ కొట్టడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడిందని, ఆ సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాప్రాయం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.