Simhachalam: అప్పన్న నిజరూప దర్శనం కోసం.. భక్తుల అష్టకష్టాలు.. సింహగిరిపై గందరగోళం
వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని.. సింహాచలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి
By అంజి Published on 23 April 2023 5:45 AM GMTSimhachalam: అప్పన్న నిజరూప దర్శనం కోసం.. భక్తుల అష్టకష్టాలు.. సింహగిరిపై గందరగోళం
విశాఖపట్నం: వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని.. సింహాచలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిజరూప దర్శనం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పి.అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా 'నిజరూప' తొలి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి స్వామి వారి సర్వదర్శనం ప్రారంభమైంది. స్వామి వారికి ప్రభుత్వం తరఫున మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 8 గంటలకు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు.
మరోవైపు వేలాది మంది భక్తులు సింహగిరికి తరలివచ్చారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు దర్శనం కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసినా.. కాసింత కూడా క్యూలైన్లు ముందుకు కదలడం లేదని భక్తులు వాపోతున్నారు. ఈ సంవత్సరం వేల సంఖ్యలో ప్రోటోకాల్ టిక్కెట్లు జారీ చేయబడ్డాయి. దీంతో టిక్కెట్లు పొందిన వారికి 'అంతరాలయ దర్శనం' సౌకర్యం కల్పించబడింది. అయితే ప్రోటోకాల్ దర్శనాలు నిర్వహణలో దేవస్థానం అధికారులు విఫలయ్యారని విమర్శలు వస్తున్నాయి.
దీంతో క్యూ లైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సక్రమంగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో భక్తులకు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ గందరగోళం కారణంగా చాలా మంది భక్తులు బస్సులను దిగి స్వామి వారి దర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తున్నారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.