వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల దుమారం, మహిళా కమిషన్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  10 July 2023 5:13 PM IST
AP Women Commission, Notice, Pawan kalyan, Police Complaint,

వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల దుమారం, మహిళా కమిషన్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్‌ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక మరోవైపు పవన్‌ కళ్యాణ్‌పై వాలంటీర్లు ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు.. వాలంటీర్ల గురించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.

వారాహి యాత్రలో భాగంగా పవన్‌ కళ్యాణ్ ప్రభుత్వం తీరుని ఎత్తిచూపుతూ రోజూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ సంచలన కామెంట్స్‌ చేశారు. ఆదివారం ఏలూరు సభలో మాట్లాడుతూ.. ఏపీలలో కనపడకుండా పోయిన 29వేల మందికి పైగా మహిళల వెనుక వాలంటీర్లు ఉన్నారని అన్నారు. ఈ విషయం కేంద్ర నిఘా వర్గం చెబుతోందని అన్నారు. ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకుని, ట్రాప్‌ చేసి, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడమే వాలంటీర్ల పని అని విమర్శించారు. ప్రస్తుతం ఆయన వాలంటీర్లపై వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగుతోంది. వాలంటీర్లు అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని, తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతకు ముందే పవన్‌కు ఏపీ మహిళా కమిసన్ నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్‌ గురించి చేసిన కామెంట్స్‌పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని సూచించింది. అంతేకాదు.. ఆధారాలను 10 రోజుల్లో సబ్మిట్‌ చేయాలని చెప్పింది. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగాను వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది ఏపీ మహిళా కమిషన్.

మహిళలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈమెయిల్స్‌ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేశామని వాసిరెడ్డి పద్మ వివరించారు. ఇష్టానుసారం మహిళల గురించి వ్యాఖ్యలు చేసి తప్పించుకోవడం కుదరదని, వాలంటీర్లకు వ్యతిరేకంగా పవన్‌ కుట్ర చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పవన్ చెప్తున్నట్లు మహిళల మిస్సింగ్‌కు సంబంధించి లెక్క చెప్పాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Next Story