ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి ప్రకోపం మొదలైంది. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎండ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చి మధ్యలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఎండలు ఇంకెలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో వడగాళ్లు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధ వారాల్లో సైతం వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అవసరం అయితేనే బయటకు రావాలని లేదంటే ఇళ్లలోనే ఉండాలని సూచించింది.
మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని రెండు మండలాలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్క మండలంలో తీవ్ర వడగాల్పులు, శ్రీకాకుళం జిల్లాలో ఆరు, విజయనగరంలో 4, విశాఖలో 7, తూర్పు గోదావరిలో 25, పశ్చిమ గోదావరిలో 14, కృష్ణా జిల్లాలో 17, గుంటూరులో 19, కర్నూలు జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. బుధవారం నాటికి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరంలో 20, విశాఖపట్నంలో 16, తూర్పుగోదావరిలో 27, పశ్చిమ గోదావరిలో 17,కృష్ణాలో 25, గుంటూరులో 23, కర్నూలులో 10, కడప, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కటి.. మొత్తం 153 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.