ఏపీలో విభిన్న వాతావరణం.. 5 రోజుల పాటు పిడుగులతో కూడిన అకాల వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని...
By - అంజి |
ఏపీలో విభిన్న వాతావరణం.. 5 రోజుల పాటు పిడుగులతో కూడిన అకాల వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. మారుతున్న ఈ వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కోస్తా ఆంధ్ర, యానాం మరియు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏప్రిల్ 11న కూడా ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 12 నాటికి తీరప్రాంత ఆంధ్రలో గాలి వేగం కొనసాగుతూనే, మరోవైపు వేడి , తేమతో కూడిన అసౌకర్య వాతావరణం మొదలవుతుంది. ఇక ఏప్రిల్ 13 నుండి 16 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ మరియు యానాం ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కొనసాగుతాయని, ప్రజలకు ఎండ వేడి నుండి పెద్దగా ఉపశమనం లభించకపోవచ్చని పేర్కొంది.
ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి కారణంగా ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. దీనితో పాటు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై ప్రభావం చూపుతోందని ఐఎమ్‌డి వివరించింది.
అటు రాష్ట్రంలో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేడు శ్రీకాకుళం 8, విజయనగరం 20,మన్యం14,అల్లూరి 1, పోలవరం6, అనకాపల్లి 5, కాకినాడ 2, తూర్పుగోదావరి4, ఏలూరు3, ఎన్టీఆర్3 మండలాల్లో(66) తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే 79 మండలాల్లో వడగాలులు. ఆదివారం మొత్తంగా 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.