బిగ్ బ్రేకింగ్.. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
AP Tenth and Inter Exams cancelled.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠకు
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2021 2:07 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠకు తెరపడింది. సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. పరీక్షల రద్దు వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. జులై 31 లోపు ఇంటర్ ఫలితాలను వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పిందని.. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుందన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యమన్నారు. మార్కులు ఏ పద్దతిలో ఇవ్వాలో త్వరలో చెబుతామన్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదని.. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఒక్కరు చనిపోయిన కోటి పరిహారం ఇవ్వాలన్న సుప్రీం
అంతకముందు.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు (గురువారం) ఉదయం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది,విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికి రూ.1కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించింది. జూలై చివరిలో నిర్వహిస్తామని చెప్పారు గానీ.. పరీక్ష తేదీలను వెల్లడించలేదని మండిపడింది. 15 రోజుల ముందుగా టైం టేబుల్ ఇస్తే.. ఆ సమయం సరిపోతుందని ఎలా చెబుతారని ప్రశ్నించింది. సరైన గాలి, వెలుతురు ఉండే పరీక్షలు నిర్వహించే గదుల వివరాలేవీ అఫిడవిట్ లో లేవని చెప్పింది. ప్రభుత్వం తెలిపిన వివరాల మేరకు సుమారు 28వేల గదులు అవసరం అవుతాయని అభిప్రాయ పడింది.
పరీక్షలు నిర్వహించగానే పని అయిపోయింది అని అనుకోలేము గదా.. వాటిని మూల్యాంకనం చేయాలి, ఆతరువాత చాలా ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబందించిన వివరాలేమీ అఫిడవిట్‌లో కనిపించలేదని పేర్కొంది. రెండో దశ తీవ్రత చూసి పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణలు చెబుతున్నప్పటికి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడింది. అవసరం అయితే.. సీబీఎస్ఈ, యూజీసీ,ఐసీఎస్ఈ బోర్డు సలహాలు తీసుకోవాలని సూచించింది. ఇక గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికి.. పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇక పరీక్షలు జరుగుతున్న సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారని ప్రశ్నించింది. కొంతసమయం ఇస్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో రేపటికి విచారణను వాయిదా వేశారు.