ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో నిధుల దుర్వినియోగం సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ముమ్మరం చేసింది. ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే 26 మందికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఏపీఎస్‌ఎస్‌డీసీ మాజీ సీఈవో గంటా సుబ్బారావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్, రిటైర్డ్ అధికారి కె లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు.
ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసుకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా లక్ష్మీనారాయణ కొనసాగారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీమెన్స్ సంస్థతో రూ.3,350 కోట్ల డీల్ కుదుర్చుకుంది. ఇందులో రాష్ట్ర సర్కార్ వాటా రూ.370 కోట్లు కాగా రూ.240 కోట్లు దారి మళ్లీంచినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులో నిర్దారణ అయ్యింది.
రూ. 241 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఏపీఎస్‌ఎస్‌డీసీ మాజీ సీఈవో గంటా సుబ్బారావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ, ఓఎస్‌డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్ ఓఎస్‌డీతో సహా 26 మందిపై ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఏపీ సీఐడీ బృందాలు హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. కీలక పత్రాలకు సంబంధించిన ఆడిటింగ్ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలను ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకుంది.